సినీ ఫక్కీలో గంజాయి ర‌వాణా

32 కిలోల గంజాయి ప‌ట్టుకున్న పోలీసులు
వాహనం స్వాధీనం
గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు

తిరుప‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : సినీ ఫక్కిలో జరిగిన గంజా అక్రమ రవాణాలను చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా ఛేదించారని తిరుపతి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు విలేక‌రుల సమావేశంలో వెల్లడించారు . గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందడంతో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, పాకాల సీఐ, చంద్రగిరి ఏంఆర్ఓ, చంద్రగిరి సీఐ ఎం. సురేష్ కుమార్, ఆర్‌సీ పురం ఎస్‌ఐ ఎం. భక్తవత్సలం, చంద్రగిరి ఎస్‌ఐ వై.అనిత బృందం ఆదివారం మధ్యాహ్నం తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారి (NH-140) తువ్వ చేనుపల్లి గ్రామ సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పొన్ను స్వామి సెల్వరాజ్ గంజాయి అక్రమ రవాణాను సినీ ఫ‌క్కీలో తరలిస్తుండగా చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ముద్దాయి తరలిస్తున్న కారులో సాధారణ తనిఖీ చేయగా ఏ విదమైన గంజాయి కనబడలేదు. అనుమానంతో పోలీస్ జాగిలం సహాయంతో సోదాలు చేయగా కారులో డాష్ బోర్డు, గేర్ బాక్స్, టైర్ స్టెప్ భాగంలో గంజాయి ఉన్నట్టు కనిపెట్టారు. వాహనంలో దాచిన 27 ప్యాకెట్ల (32.730 కిలోలు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి వాహనం నడుపుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన‌ పొన్నుస్వామి సెల్వరాజ్ ను అరెస్ట్ చేశారు. వాహనంలో దొరికిన రూ. 6 లక్షల విలువైన గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఎస్పీ సుబ్బరాయుడు, మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను రవాణా చేస్తే ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్‌ను నాశనం చేస్తాయ‌న్నారు. డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. మ‌త్తు విక్రయాల గురించి తెలిస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ 112 కి సమాచారం ఇవ్వాల‌న్నారు. అనంతరం ఈ కేసులో ప్రతిభ కనబరిచిన చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, సీఐలు ఎం. సురేష్ కుమార్ చంద్రగిరి, సుదర్శన్ పాకాల, ఎస్‌ఐలు ఎం. భక్తవత్సలం, వై. అనిత, తరుణ్, మంజులను అభినందించి రివార్డు ఇచ్చారు.

Leave a Reply