ప్రధాని మోదీ అద్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ బాడీ సమావేశం
వికసిత్ భారత్, స్వర్ణాంధ్రపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
ఇప్పటి వరకు సాధించినవి, భవిష్యత్ లక్ష్యాలు వివరణ
చంద్రబాబు ప్రజెంటేషన్ కు మోదీ ప్రశంసలు
అన్ని రాష్ట్రాలు అనుసరించాలని పిలుపు
న్యూ ఢిల్లీ – ఏపీలో 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నేడు ప్రారంభమైంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన గవర్నర్‌లు, సీఎంతో ప్రధాని మాట్లాడారు.
ఈ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై చంద్రబాబు నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన స్వర్ణాంధ్ర సాకారంపై పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్‌లో ప్రస్తావించారు
రాష్ట్రంలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనే విషయాన్ని తన ప్రజంటేషన్‌లో తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు వెల్లడించారు. విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా ఏపీ సీఎం కోరారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం.. కర్నూలులో డ్రోన్ సిటీ ప్లాన్లను ప్రజెంటేషన్‌లో ప్రత్యేకంగా వివరించారు. డిజిటల్ గవర్ననెన్స్‌లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల నిబంధన రద్దు చేసినట్టు ప్రజెంటేషన్‌లో సీఎం వివరించారు.
మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్టు సీఎం వెల్లడించారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, రాష్ట్ర పురోగతిని కొలిచేందుకు 523 కీలక సూచికలు సిద్ధం చేశామన్నారు. ప్రతి కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ పార్క్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పీ4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని.. అర్బన్ రూరల్ సినర్జీ మోడల్ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తన ప్రజెంటేషన్‌లో సీఎం చంద్రబాబు వివరించారు.
చంద్రబాబు సూచనలకు మోదీ ప్రశంసలు..
సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు. చంద్రబాబు ప్రజెంటేషన్‌కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.