సరిహద్దుల్లో అధికారుల వైఫల్యం

సరిహద్దుల్లో అధికారుల వైఫల్యం
వికారాబాద్ జిల్లా, ఆంధ్రప్రభ ప్రతినిధి: జిల్లాకు ఆనుకుని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉండటం అక్రమార్కులకు వరంగా మారింది. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, నిఘా లోపించడం, ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించకపోవడంతో అక్రమార్కులదే ఇష్టారాజ్యంగా మారింది. జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని అనేక ప్రాంతాలు కర్ణాటకతో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ సరిహద్దుల్లో తిష్టవేసిన అక్రమార్కులు పలు రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు.
జిల్లాలోని తాండూరు ప్రాంతంలో వందల సంఖ్యలో నాపరాయి పాలిష్ యూనిట్లు ఉన్నాయి. దీనికి అవసరమైన ముడి నాపరాయి అధిక శాతం కర్ణాటకలోని మిర్యాన్ ప్రాంతం నుంచి రవాణా అవుతోంది. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా రోజూ వందల సంఖ్యలో లారీలు కర్ణాటక నుంచి సరిహద్దులు దాటి తాండూరుకు చేరుతున్నాయి. ఈ అక్రమ రవాణా ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వ శాఖలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. మన రాష్ట్రంలో గుట్కాపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ, పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాత్రం పెద్దగా ఆంక్షలు లేవు. అక్కడ తయారైన గుట్కాను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. సరిహద్దులో అనేక మార్గాలు ఉండటంతో అక్రమార్కులు భారీ మొత్తంలో గుట్కాను తరలిస్తున్నారు.
నాసిరకం పత్తి విత్తనాలన్నీ ఆ రాష్ట్రానివే..
జిల్లాలోని రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న ఉచిత సన్నబియ్యాన్ని కొనుగోలు చేసే ముఠాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ముఠా ఈ అక్రమ దందాను నడిపిస్తోంది. లబ్ధిదారుల నుంచి మధ్యవర్తుల ద్వారా వ్యాపారుల చేతికి చేరుతున్న ఈ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులో కాగ్నా నది ప్రవహిస్తోంది. ఈ నదిలో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. కర్ణాటకకు చెందిన వ్యాపారులు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సరిహద్దులు దాటి యంత్రాలతో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఈ సమస్య ప్రధానంగా బషీరాబాద్ మండల పరిధిలో కనిపిస్తోంది.
అదే విధంగా, మన రాష్ట్ర పరిధిలో ఉన్న అటవీ భూముల్లో చెట్లను అక్రమంగా నరికి, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ గిరిజనుల ద్వారా యథేచ్ఛగా సాగు చేస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు పెద్దగా స్పందించడం లేదు. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో పోలీసు టాస్క్ ఫోర్స్ బృందాలు పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుంటున్నాయి. క్వింటాళ్ల కొద్దీ నాసిరకం విత్తనాలను సీజ్ చేస్తున్నారు. ఈ నకిలీ విత్తనాలు ఎక్కువగా కర్ణాటక నుంచే వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొడంగల్ మార్గంగా జిల్లాలోకి తీసుకువచ్చి రైతులకు విక్రయిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన విత్తన మాఫియా ముఠాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఇంకా కల్తీ టీ పౌడర్, కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వంటి పదార్థాలను కూడా కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా తీసుకువస్తున్నారు.
ఈ అక్రమాలను అరికట్టేందుకు గతంలో రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులు కలిసి సరిహద్దు అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే ఇటీవల ఈ తరహా సమావేశాలు జరగకపోవడంతో అక్రమార్కులు మళ్లీ రెచ్చిపోతున్నారు.
