తడబడిన టీమిండియా..

  • కోహ్లీ, శ్రేయస్ అర్ధశతకాలు…
  • 233 పరుగులకే ఆలౌట్
  • ఇంగ్లండ్ ముందు 234 పరుగుల లక్ష్యం

ఆంధ్రప్రభ : ఇంగ్లాండ్ తో జ‌రుగుత‌న్న రెండో వన్డేలో టీమిండియా ఆలౌట్ అయ్యంది. ఒక దశలో 300 పరుగులు చేసే స్థితిలో కనిపించిన భారత్.. చివర్లో వరుస వికెట్లు కోల్పోయి 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 234 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు రోహిత్ శర్మ (26), శుభ్‌మన్ గిల్ (31) తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించి మంచి ఆరంభం అందించారు. అనంతరం విరాట్ కోహ్లీ (65) తన క్లాస్‌ను మరోసారి చాటగా, శ్రేయస్ అయ్యర్ (66) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించి భారత్‌ను బలమైన స్థితిలో నిలిపారు.

అయితే 178/3 వద్ద ఉన్న భారత్.. కోహ్లీ ఔటైన తర్వాత పూర్తిగా తడబడింది. వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1), శివమ్ దూబే (0) వరుసగా విఫలమవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఇంగ్లండ్ వైపు మళ్లింది. చివర్లో జస్ప్రీత్ బుమ్రా 13 బంతుల్లో 20 పరుగులు చేసి స్కోరును 233కు చేర్చినా, చివరి ఏడు వికెట్లను కేవలం 55 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ తలో మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కుదేలు చేశారు. సాకిబ్ మహ్మూద్ రెండు వికెట్లు పడగొట్టగా, సామ్ కరన్, విల్ జాక్స్ తలో వికెట్ సాధించారు.

ఇప్పుడు మ్యాచ్‌లో పైచేయి ఇంగ్లండ్‌కే కనిపిస్తున్నా, కార్డిఫ్ పిచ్ బౌలర్లకు కూడా కొంత సహకరిస్తోంది. భారత బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు సాధిస్తే 233 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకునే అవకాశం టీమిండియాకు ఉంది.