ఆర్టీసీకి కొత్త దశ

ఆర్టీసీకి కొత్త దశ
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : దాదాపు ఎనిమిది దశాబ్దాల ఆర్టీసీ చరిత్ర త్వరలోనే మార్పు దిశగా అడుగులు వేస్తోంది. చారిత్రాత్మకమైన ఈ సంస్థ విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ప్రజా రవాణా విభాగం)గా రూపాంతరం చెందనుంది. మూడు రోజుల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె ఫలితంగా ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఆ మేరకు అంతర్గత కసరత్తు కూడా ప్రారంభించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజా సమ్మెలో యూనియన్ నేతలు, ప్రభుత్వ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం కీలకంగా మారింది. ఆర్టీసీలోని మొత్తం 38,300 మందిని త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. విలీనం అనంతరం తెలంగాణ ఆర్టీసీ ప్రజా రవాణా విభాగంగా మారనుంది.
ప్రత్యేక కమిటీ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉన్నతాధికారులు, నిపుణులు, యూనియన్ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తరువాత న్యాయ నిపుణులతో చర్చించి, క్యాబినెట్లో ఆమోదం తీసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విలీనం పూర్తయితే ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారి ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదవీ విరమణ ప్రయోజనాలు, సెలవులు వంటి లాభాలు పొందుతారు. విలీనంతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కూడా గణనీయమే. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆర్టీసీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో యూనియన్ డిమాండ్లలో చాలా వాటిని మంత్రుల కమిటీ ఆమోదించింది.
ఇకపై వారంతా ప్రభుత్వ ఉద్యోగులే
సంస్థలో పని చేస్తున్న 38,300 మందికి జీతాలు పెరగడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగి అనే భరోసా లభిస్తుంది. జీతాల పెంపు వారి బేసిక్ పే ఆధారంగా నిర్ణయించబడుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2021 ఏప్రిల్ 1 తర్వాత పదవీ విరమణ పొందిన సుమారు 9,600 మందికి కూడా జీతాల పెంపు ప్రయోజనం లభించనుంది.
జీతాల పెంపు వల్ల నెలకు ప్రభుత్వం మీద సుమారు రూ. 35 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి ఇది దాదాపు రూ. 420 కోట్లకు చేరుతుంది. కండక్టర్లకు నెలకు రూ. 4 వేల నుంచి రూ. 15 వేల వరకు, డ్రైవర్లకు రూ. 4 వేల నుంచి రూ. 17 వేల వరకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. 2021 నుంచి పెంపు వర్తించడంతో బకాయిల మొత్తం సుమారు రూ. 2,400 కోట్లు అవుతుంది. ఈ భారాన్ని దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశ్రాంత ఉద్యోగులకు రూ. 200 కోట్లను ముందుగా చెల్లించడం, మిగిలిన బకాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లించేలా ప్రణాళిక రూపొందుతోంది.
నిజాం కాలంలో ఆర్టీసీ పుట్టుక
స్వాతంత్య్రానికి ముందే నిజాం పాలనలో ఆర్టీసీ పునాదులు వేయబడ్డాయి. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఆయన కోడలు జోహ్రా బేగం తనకు లభించిన మహర్ నిధులను ప్రజల ప్రయోజనార్థం వినియోగించాలని నిర్ణయించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆమె, సామాన్య ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందించాలనే ఉద్దేశంతో బస్సు డిపోలు ఏర్పాటు చేయించారు. ఈ విధంగా ఆర్టీసీకి పునాది పడింది.
