ipl 2026| చెన్నైతో హైద‌రాబాద్ ఢీ

హైద‌రాబాద్ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు..
ఈ జ‌ట్టుతో పాటు గుజ‌రాత్ కూడా..
చెన్నైకీ కీలక మ్యాచ్‌..
గెలిస్తేనే ప్లేఆఫ్స్‌పై ఆశ‌లు
లేదంటే ఇంటి దారే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. లీగ్ మ్యాచులు ఇక వారం రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్లేఆఫ్స్ బెర్త్ ఒక్క బెంగ‌ళూర్ జ‌ట్టు మాత్ర‌మే క‌న్ఫార్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఇత‌ర జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ -సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఫలితం ఆధారంగానే ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయనేది తేల‌పోతుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే ఎస్ఆర్‌హెచ్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

ఒకవేళ సన్‌రైజర్స్ ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం కావడంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ 1కి అర్హత సాధిస్తుంది. సన్‌రైజర్స్‌పై ఓడిపోతే సీఎస్కే ఆల్‌మోస్ట్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే కాబట్టి. నాలుగో స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్ మధ్యే పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాంతో ఈ మ్యాచ్‌కి చెన్నై సూపర్ కింగ్స్‌కి చావో రేవో అన్నట్టుగా మారింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్‌లలో 7 గెలిచి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్‌లలో 8 గెలిచి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్‌లలో 6 గెలిచి 12 పాయింట్లతో కొనసాగుతోంది. దాంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే 16 పాయింట్లు సాధిస్తుంది. దాంతో సన్‌రైజర్స్, గుజరాత్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు కన్ఫార్మ్ చేసుకోనున్నాయి.