మూలపాడులో ఆక్రమణల తొలగింపు

స్వచ్ఛందంగా సామగ్రిని తరలించుకుంటున్న ఆక్రమణదారులు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఆక్రమణలను సోమవారం ఉదయం పోలీసు, ఏఆర్ బందోబస్తు మధ్య హైవే సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. స్టేడియం, బటర్ ఫ్లై పార్కు, త్రిలోచనాపురం వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను, బ్లాక్ స్పాట్ లను పరిశీలించారు. మూలపాడును అత్యంత ప్రమాదకర బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యతిరేక మార్గంలో ప్రయాణించి ప్రమాదాల బారిన పడుతున్నట్లు గమనించారు. దీనికి ప్రత్యామ్నాయంగా సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం రహదారి వెంట ఉన్న షాఫులు, ఇళ్లను తొలగిస్తున్నారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా సామగ్రిని తరలించుకుని పోలీసులకు సహకరించారు. నిర్మాణాలను, చెట్లను జేసీబీలతో తొలగించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సర్వీస్ రోడ్డు అవశ్యం: ఏసీపీ
మూలపాడులో రోడ్డు ప్రమాదాల నివారణకు సర్వీస్ రోడ్డు అవశ్యమని పశ్చిమ జోన్ ఏసీపీ దుర్గారావు అన్నారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ పర్యటనలో భాగంగా మూలపాడులో బ్లాక్ స్పాట్ ను గుర్తించారని చెప్పారు. మూలపాడు సెంటర్ నుంచి త్రిలోచనాపురం, స్టేడియం, బటర్ ఫ్లై పార్కుకు వ్యతిరేక మార్గంలో వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం జాతీయ రహదారి పరిధిలో ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్సైలు రాజు, రవివర్మ, సత్యవతి, ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ తదితరులు ఉన్నారు.






