విద్య‌తోనే పోటీ..!

  • 50 ఏళ్ల దృష్టితో విద్యాభివృద్ధికి కృషి
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు


హైద‌రాబాద్ బ్యూరో : ప్ర‌పంచంతో పోటీ ప‌డాలంటే విద్య ద్వారానే సాధ్య‌మ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti Vikramarka) మ‌ల్లు అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ లో ఓ ప్రైవేట్ సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్ ఆవిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు. రానున్న 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తుందని తెలిపారు. సామాజిక మార్పు (Social change), వెనుకబాటు తనాన్ని రూపుమాపాలన్న, సమ సమాజ స్థాపనకు విద్య ఒక్కటే మార్గం అని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, ఆర్ఈసీ, యూనివ‌ర్సిటీ ఏర్పాటుల‌తోనే మ‌న తెలుగు వాళ్లు ప్రముఖ కంపెనీలకు సీఈఓల స్థాయికి ఎదిగారని వివరించారు.


మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారితేనే ప్రయోజనం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ భావించిన త‌ర్వాత‌ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. పరిశ్రమలకు పనికొచ్చేలా సిలబస్ రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన 100 ఐటీఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ (Advanced technology) సెంటర్లుగా మార్చామ‌న్నారు. వివిధ పరిశ్రమల అధిపతులు సూచించిన సిలబస్ ను వాటిలో ప్రవేశపెట్టామని తెలిపారు.

పేదలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లు పెట్టుబడితో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 104 యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి జీవో జారీ చేశామ‌ని, పాఠాలు బోధించే సిబ్బంది కూడా అక్కడే ఉండేలా వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

కోటి ఉమెన్స్ కాలేజీ (Koti Women’s College) కి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి రూ.500 కోట్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నామని, ఉస్మానియా యూనివర్సిటీలో కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని, బీసీల నియామకం చేశామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు (Private companies) కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంద‌న్నారు.