గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ దివ్యౌషధం

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ దివ్యౌషధం
- డా. కోటిరత్నం
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ : గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ డాక్టర్ కోటిరత్నం తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.
14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలందరూ తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ టీకా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు. ఈ వ్యాక్సిన్‌కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, పూర్తిగా సురక్షితమని స్పష్టం చేశారు. పుట్టిన ప్రతి బిడ్డకు ప్రభుత్వం సూచించిన అన్ని వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం అందేలా చూడాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.
వచ్చే సోమవారం ఉదయం 9:30 గంటలకు గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీకా వేయించుకునే బాలికలు తప్పనిసరిగా తమ తల్లిదండ్రులను వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తీగల నరసింహ, స్టాఫ్ నర్స్ యశోద, ఎల్టీ సురేష్, రేణుక తదితర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
