ప్రభుత్వాసుపత్రిలో పై కప్పు కూలి…

ప్రభుత్వాసుపత్రిలో పై కప్పు కూలి…

మహిళకు గాయాలు..
ఇటీవలే ఒక వార్డులో అగ్ని ప్రమాదం..
నేడు పై కప్పు కూలి భద్రత ప్రశ్నార్థకం

గుంటూరు బ్యూరో / ఆంధ్రప్రభ : గుంటూరు ప్రభుత్వాసుపత్రి పేరు వింటే ఒకప్పుడు “పేదల వైద్య దేవాలయం” అనేవారు… ఇప్పుడు మాత్రం “ప్రాణాలకు పరీక్షా కేంద్రం”గా మారిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొన్న రక్త పరీక్షల ల్యాబ్‌లో అగ్నిప్రమాదం… నేడు బర్న్స్ వార్డులో పైకప్పు కూలిపోవడం… ఇలా చూస్తుంటే ఆసుపత్రిలో చికిత్స కంటే ప్రమాదాలే వేగంగా జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోగి ఏ విభాగానికి వెళ్తాడో కంటే… ఏ ప్రమాదం ఎదురవుతుందో ముందుగా అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

గడ్డ చికిత్సకు వచ్చి… “గాయం”తో బెడ్‌పైకి…

పాములపాడుకు చెందిన కుమారి అనే మహిళ చెవి దగ్గర వచ్చిన గడ్డకు చికిత్స చేయించుకోవాలని ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ పరీక్షించి మందుల చీటీ ఇచ్చారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వాసుపత్రి అసలు “సర్వీస్” అక్కడి నుంచి మొదలైంది. మందులు తీసుకునేందుకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి. గడ్డకు మందులు తీసుకునే లోపే తలకు తీవ్ర గాయం… చివరకు కుట్లు వేయాల్సిన దుస్థితి. రోగం ఒకటి… ఆసుపత్రి బోనస్‌గా ఇచ్చిన గాయం మరొకటి అన్నట్లైంది.

ఇది సాధారణ సంఘటన కాదని రోగుల బంధువులు మండిపడుతున్నారు.ఆసుపత్రి అంటేనే రోగాలు తగ్గించే ప్రదేశం… కానీ అక్కడే పైకప్పులు కూలిపోతే ఇక రోగులు ఎవరిని నమ్మాలి.. ఆసుపత్రి గోడలు, పైకప్పులు ఎప్పుడెప్పుడు ఊడిపడతాయో అన్న భయంతో రోగులు టెన్షన్ పడుతున్నారు.

మొన్న ల్యాబ్‌లో మంటలు…

మొన్నటికి మొన్న రక్త పరీక్షల లేబరేటరీలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఇప్పుడు పైకప్పు ఘటన. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం “పరిశీలిస్తాం… చర్యలు తీసుకుంటాం…” అనే రెడీమేడ్ ప్రకటనలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. భవనాల మరమ్మతులు, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ అన్నీ ఫైల్స్‌కే పరిమితమయ్యాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆసుపత్రిలో సాహస యాత్ర….!!!

ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేద ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులు అందుబాటులో ఉండవు. అలాంటి చోట కనీస భద్రత కూడా లేకపోవడం దారుణమని సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “డాక్టర్ చూసేలోపు పైకప్పు చూడాలి… మందులు తీసుకునేలోపు గోడలు పడతాయో లేదో చూసుకోవాలి… అన్నట్టుగా పరిస్థితి మారిందని వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి రావడం సాహస యాత్రలా ఉందన్న వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని భవనాల పరిస్థితిపై సమగ్ర తనిఖీలు చేసి రోగుల ప్రాణాలకు భరోసా కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.