హెల్మెట్ పెట్టు.. బహుమతులు పట్టు!
హెల్మెట్ పెట్టు.. బహుమతులు పట్టు!
చిత్తూరులో రోడ్డు భద్రతకు వినూత్న ప్రోత్సాహం
‘సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమంలో విజేతలకు బహుమతుల ప్రదానం
చిత్తూరు, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా మంగళవారం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా “హెల్మెట్ పెట్టు – బహుమతులు పట్టు” కార్యక్రమం వారపు, నెలవారీ విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

చిత్తూరు పట్టణంలోని మీడియా ప్రతినిధులకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నాన్ కేడర్ ఎస్పీ (ఆపరేషన్స్) ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు, చూఢా ఛైర్‌పర్సన్ కటారి హేమలత తదితరులు కలిసి హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురావడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

అనంతరం గాంధీ కూడలి నుంచి విజయం ఇంజినీరింగ్ కళాశాల వరకు సుమారు 200 మంది పాల్గొన్న భారీ హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మీడియా మిత్రులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం విజయం ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా, వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులేనని తెలిపారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే అనేక ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.
హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధన కాదని, ప్రాణాలను రక్షించే రక్షణ కవచమని పేర్కొన్నారు. జరిమానాల భయంతో కాకుండా తమ ప్రాణాల విలువను గుర్తించి స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించే అలవాటు పెంచుకోవాలని సూచించారు.
ప్రజల్లో మంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో “హెల్మెట్ పెట్టు – బహుమతులు పట్టు” కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తాను మాత్రమే కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలని సూచించారు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని కోరారు. రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.
నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. హెల్మెట్ వినియోగం, అతివేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి అంశాలపై ప్రజలు శ్రద్ధ వహిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమం ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచుతోందని తెలిపారు. “హెల్మెట్ పెట్టు – బహుమతులు పట్టు” వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో మంచి అలవాట్లను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
ఏప్రిల్ 6, 2026 నుంచి నిర్వహిస్తున్న “హెల్మెట్ పెట్టు – బహుమతులు పట్టు” కార్యక్రమంలో ఎంపికైన వారపు, నెలవారీ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, ఇతర ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
అలాగే ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన విజయం విద్యా సంస్థల చైర్మన్ తేజోమూర్తికి జిల్లా పోలీసు శాఖ తరఫున ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎం. దేవదాస్, చిత్తూరు ఎస్‌డీపీఓ జె. వెంకటనారాయణ, చూఢా ఛైర్‌పర్సన్ కటారి హేమలత, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నిత్యబాబు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మురళీమోహన్, 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య, జీడీ నెల్లూరు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్ర, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ట్రాఫిక్ విభాగం సిబ్బంది, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
