సమస్యల పరిష్కారానికి సుగు ణమ్మ ప్రజా దర్బార్

సమస్యల పరిష్కారానికి సుగుణమ్మ ప్రజా దర్బార్
- 43 అర్జీలు స్వీకరణ.. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
- రేషన్ కార్డులు, పెన్షన్ల సమస్యలకు తక్షణ పరిష్కారం
- టిడ్కో హౌస్ రీఫండ్‌లపై అర్హులకు త్వరితగతిన చెల్లింపులు
- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సుగుణమ్మ
తిరుపతి, ఆంధ్రప్రభ : నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి నగరానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో వినిపించారు. మొత్తం 43 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
రాజీవ్ నగర్‌కు చెందిన వసుంధరకు రూ.61,982, ప్రకాశం రోడ్డుకు చెందిన సోమా జనార్దన్‌కు రూ.76,009, మధురానగర్‌కు చెందిన బేబీ కొండా లోక్షిత సాయికి రూ.83,352, మాధవికి రూ.48,962 చొప్పున మొత్తం రూ.2,70,305 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 36వ వార్డులో శిధిలావస్థకు చేరిన పాత భవనాన్ని కూల్చివేయాలని ఇంటి యజమాని చేసిన విజ్ఞప్తిపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం వచ్చిన వినతులను పరిశీలించి కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టిడ్కో హౌస్‌ల కోసం రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష చెల్లించిన లబ్ధిదారుల రీఫండ్ అంశంపై వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి త్వరితగతిన రీఫండ్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన పత్రాలు సమర్పిస్తే ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామని సుగుణమ్మ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, రుద్రకోటి సదాశివం, అన్నా అనిత, చందన స్రవంతి, బీజీ కృష్ణ యాదవ్, మన్యం శ్రీనివాసులు, మునిశేఖర్ రాయల్, సుబ్రహ్మణ్యం, ఆముదాల తులసి, కరాటే చంద్ర, రజనీకాంత్ నాయుడు, విశ్వనాథం, యువ మహిళా నాయకురాలు బట్టే వెంకట కీర్తి, బ్యాంక్ శాంతమ్మ, రామూర్తి రాయల్, కేవీ రమణ, బాలు, పార్లమెంట్ నాయకులు రేవతి, హేమావతి, రేఖ, ఐటीडీపీ మునిచంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు.
