భక్తుల భద్రత కోసమే దుకాణాల తొలగింపు

  • దుకాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేస్తాం
  • అర్హులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై చర్యలు
  • ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నివారణే లక్ష్యం: కలెక్టర్

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : అలిపిరి ప్రాంతంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక దుకాణాలను తొలగించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన వారికి సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో అలిపిరి ప్రాంతంలో తాత్కాలిక దుకాణాలు తొలగించడంతో ఉపాధి కోల్పోయిన దుకాణదారులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్నారని తెలిపారు. తిరుమలకు ప్రధాన ప్రవేశ ద్వారమైన అలిపిరి ప్రాంతంలో భక్తుల రద్దీ ఎల్లప్పుడూ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.

రాకపోకలకు అంతరాయం..

రహదారి పక్కన పెద్ద సంఖ్యలో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయడంతో భక్తుల రాకపోకలకు, వాహనాల సంచారానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన లగేజీ కౌంటర్ కారణంగా కూడా ఈ ప్రాంతంలో రద్దీ మరింత పెరుగుతోందన్నారు. అలిపిరి పరిసర ప్రాంతాలు భారతీయ విద్యాభవన్, సైన్స్ సెంటర్, వేదిక్ యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌సీసీ అకాడమీ, అరవింద్ కంటి ఆసుపత్రి, టాటా క్యాన్సర్ ఆసుపత్రి, జూపార్క్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గంగా ఉండటంతో వాహనాల రాకపోకలు అధికంగా సాగుతున్నాయని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

వన్యప్రాణుల సంచారం..

అలిపిరి పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో వన్యప్రాణుల సంచారం పెరిగిందని, ఇటీవల చిరుతపులులు ఎస్‌వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కనిపించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. భక్తులు, వాహనదారులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ, పోలీసు శాఖ, నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా చర్చించి తాత్కాలిక దుకాణాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. అయితే, దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయిన వారిలో అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుందని తెలిపారు. బాధితుల సమస్యలను సానుభూతితో పరిశీలించి, సాధ్యమైనంత మేరకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.