ఆక్రమణలు, అరాచకాలపై పోరాటం కొనసాగిస్తాం
ఆక్రమణలు, అరాచకాలపై పోరాటం కొనసాగిస్తాం
టీడీపీ నేతల దౌర్జన్యాలకు భయపడేది లేదు: నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
వెంకటగిరి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఆక్రమణలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని, వాటిని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెరియవరం గ్రామంలో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
డక్కిలి మండలం వెంబులూరు గ్రామంలో భూముల విషయంలో గతంలో ఆర్‌టీఐ చట్టం కింద దారి లేదని సమాచారం ఇచ్చిన అధికారులు, ఇప్పుడు దారి ఉన్నట్లు చెప్పడం ఎలా సాధ్యమవుతుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వార్డుల పెంపు అంశంలో సమగ్ర నివేదికలు లేకుండా అధికారులకు నచ్చిన విధంగా వార్డుల రూపకల్పన చేయడం సరికాదన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై చేస్తున్న దౌర్జన్యాలకు భయపడబోమని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలయ్య మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెందిన భూములను కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీవో, ఎస్‌ఐ, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ కౌన్సిలర్ శంకరయ్య మాట్లాడుతూ, వార్డుల పెంపు ప్రక్రియలో స్పష్టత లేదన్నారు. అనంతరం పలు స్థానిక అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
