ఇంధన ధరల పెంపుపై వామపక్షాల ఆగ్రహం..
ఇంధన ధరల పెంపుపై వామపక్షాల ఆగ్రహం..
ఉరవకొండలో రాస్తారోకోతో నిరసన
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు.. ధరలు తగ్గించాలని డిమాండ్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ ప్రజలపై అదనపు భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీలు మంగళవారం ఉరవకొండ పట్టణంలో ఆందోళన నిర్వహించాయి.
పట్టణంలోని కవిత హోటల్ సర్కిల్ వద్ద సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కారణంగా కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోయి, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఎం జిల్లా నాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని మరింత భారంగా మారుస్తోందని విమర్శించారు.
అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాలు వంటి కారణాలను సాకుగా చూపుతూ ధరల పెంపును సమర్థించడం సరికాదన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి నాగేంద్ర, నాయకులు మల్లేష్, బసవరాజు, సీపీఎం నాయకులు మధుసూదన్ నాయుడు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
