Farmer | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

- వెల్లంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
Farmer | వీరులపాడు, ఆంధ్రప్రభ : వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండిస్తున్న ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉండటమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని, తూకంలో పారదర్శకత పాటిస్తూ చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
రైతుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుందన్నారు. గ్రామీణ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు తంగిరాల సౌమ్య భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
