టైగర్ జోన్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి: రిథీష్ రాథోడ్
ఇందనపల్లిలో ఆదివాసీలను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : కవ్వాల టైగర్ జోన్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రిథీష్ రాథోడ్ కోరారు. జన్నారం మండలంలోని ఇందనపల్లి నాయకపుగూడలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు దాడి చేసిన ఘటనలో బాధితులను సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో టైగర్ జోన్ రద్దుకు తీర్మానం చేస్తే బీజేపీ ఎంపీల ద్వారా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. చేపల వేటకు వెళ్లిన ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు విచక్షణారహితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీలకతీతంగా అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖ అధికారుల అన్యాయాలకు సహకరించకుండా ప్రజలు ఐక్యంగా నిలవాలని సూచించారు. కవ్వాల టైగర్ జోన్ రద్దు కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్ రావు, రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యుడు అజ్మీర బద్రి నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంతం శంకరయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బి. గోపాల్, ప్రధాన కార్యదర్శి బుర్రగడ్డ జగన్, పొనకల్ ఉపసర్పంచ్ అప్పాల జలపతి, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కందుల రమేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు రాజారావు తదితరులు పాల్గొన్నారు.
