కేజీబీవీలో ముగిసిన క్రీడోత్సవాలు

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచన

జైనూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని జైనూర్ తహసీల్దార్ ఆడ బీర్షావ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ అన్నారు.

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచంలొద్ది కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన రూరల్ వీక్–స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడోత్సవాలకు హైదరాబాద్ యంగ్ ఇండియన్స్ సభ్యులు పూనమ్ అగర్వాల్, పూజా, అర్జున్ కేడియా, పార్థ్ గుప్తా సహకారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆడ వెంకటేష్, మండల కోఆర్డినేటర్ ఆత్రం మాధవరావు ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్ బోర్డు, చెస్ పోటీలను నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు ముఖ్య అతిథులు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డా. నాగర్ గోజే అశోక్, పోచంలొద్ది కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సుమలత, అకౌంటెంట్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.