ప్రభుత్వ బియ్యం మాయం..

  • రైస్ మిల్లర్‌పై చర్యలు

దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అక్రమంగా దుర్వినియోగం చేసిన కేసులో దండేపల్లి మండలానికి చెందిన రామ లక్ష్మణ్ ఇండస్ట్రీస్ యాజమాని గంప సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించింది.

తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంచిర్యాల జిల్లా మేనేజర్ కె. శ్రీకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, రబీ 2022–23, 2023–24 సీజన్లలో ప్రభుత్వ సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించిన 9,244.206 మెట్రిక్ టన్నుల వరిని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లుకు అప్పగించినట్లు గుర్తించారు.

ఈ వరికి సంబంధించి ప్రభుత్వానికి 6,286.059 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను తిరిగి అందజేయాల్సి ఉండగా, కేవలం 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించినట్లు విచారణలో తేలింది. మిగిలిన 4,452.548 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అప్పగించకుండా అక్రమంగా మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు.

అదేవిధంగా గత సీజన్లకు సంబంధించిన సీఎంఆర్‌ను కూడా ప్రభుత్వానికి అప్పగించకుండా వరి, బియ్యాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని, సుమారు రూ.15.70 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మిల్లు ప్రాంగణంలో ప్రభుత్వానికి చెందిన వరి లేదా బియ్యం నిల్వలు ఏవీ లభించకపోవడంతో ధాన్యాన్ని అక్రమంగా మళ్లించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.

ఈ మేరకు నిందితుడు గంప సంతోష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించినట్లు లక్షేటిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.