ఎల్ నినోకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం

  • ప్రకృతి వ్యవసాయంపై రైతులకు కీలక సూచనలు
  • ఎల్ నినోను తట్టుకునే సాగుపై అవగాహన
  • ‘ఎల్ నినో’ బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన అధికారులు
  • వాతావరణ మార్పులకు ప్రకృతి సాగే మార్గమన్న నిపుణులు
  • జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్ల, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ, ఆంధ్రప్రభ: ఎల్ నినో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయమే సమర్థవంతమైన ప్రత్యామ్నాయమని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్ల, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

వినుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో వారు “ప్రకృతి వ్యవసాయం–ఎల్ నినో బుక్‌లెట్”ను ఆవిష్కరించి ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవచ్చో రైతులకు వివరించారు.

బుక్‌లెట్‌లో నేలలో తేమను సంరక్షించే పద్ధతులు, బహుళ పంటల సాగు, జీవామృతం, ఘన జీవామృతం వినియోగం, ఆచ్చాదన (మల్చింగ్), నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే విధానాలు, ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునే పంటల నిర్వహణ వంటి అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అనుసరిస్తే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవడంతో పాటు, తక్కువ పెట్టుబడితో స్థిరమైన దిగుబడులు సాధించి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్, ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యవసాయానికి ప్రకృతి ఆధారిత సాగు విధానాలే స్థిరమైన పరిష్కారమని వారు రైతులకు సూచించారు.