Srisailam | మల్లన్నా.. ఇదేందన్నా..?

మల్లన్నా.. ఇదేందన్నా..?
- శ్రీశైలంలో మల్లన్న భక్తులకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ
- ఆర్మీ ఆఫీసర్‌కు నకిలీ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్
- తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీశైలం దేవస్థానం అధికారులు
- పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా చర్యలు శూన్యం
Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శ్రీశైలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంను పర్యాటక కేంద్రంగానూ, టూరిజంగాను అభివృద్ధి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు శ్రీశైలంకి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని నకిలీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను సృష్టించటం విశేషం. అలాంటి సంఘటన ఇటీవల కాలంలో పలుమార్లు జరిగాయి. ఏపీ టూరిజం హోటల్ – హరిత శ్రీశైలం ఫేక్ వెబ్ సైట్ తో మోసపోయిన రిటైర్డ్ ఆర్మీ అధికారి బెంగళూరు వాసి కృష్ణమూర్తి. సోమవారం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన కృష్ణమూర్తి పిల్లలతో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొనుట ఏపీ టూరిజం హోటల్ – హరిత శ్రీశైలం వెబ్ సైట్ లో రూ.15950 ఆన్ లైన్ లో చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నారు. ఆయన, భార్య, తల్లి దాదాపు బెంగళూరు నుంచి గంటల ప్రయాణం చేసి వచ్చి ఏపీ టూరిజం అకామిడేషన్ దగ్గరికి వెళ్తే ఇది ఫేక్ అని తెలిపారు. దీంతో వారి బాధ వర్ణానీతం. రూ.15950 లు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్‌లు పెట్టి భక్తుల మనోభావాలను విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలాంటి ఫేక్ వెబ్ సైట్ తో మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆన్‌లైన్ దర్శనంతో సులువుగా అమ్మవారిని దర్శించుకోవచ్చు అన్న ఆలోచనతో ముందుగానే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నప్పటికీ నకిలీ అని తెలిసి పోయారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు ఈ సంఘటనపై స్పందిస్తూ నకిలీ వెబ్‌సైట్‌లను ఆశ్రయించి మోసపోవద్దని, దేవస్థానమునకు సంబంధించిన వెబ్‌సైట్‌లో భక్తులు వసతి సౌకర్యాలు గురించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు నకిలీ వెబ్‌సైట్‌లో విచారణ జరుపుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఉన్నారావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలపటం విశేషం.
