ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దు..

ఆలయాన్ని రాజకీయాలకు వేదిక చేయొద్దు..

  • గుడి నిర్మాణానికి సహకరించండి
  • మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న శ్రీ భూనీల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. శుక్రవారం ఆలయంలో ఎండోమెంట్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుందన్న సమాచారం తెలుసుకొని ఆయన తన అనుచరులతో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల తరువాత ఆలయ నిర్మాణానికి అనేక అవరోధాలు సృష్టించారని ఆయన ఆరోపించారు.

ఆలయం చెరువు శిఖం భూమిలో నిర్మించారంటూ కొందరు కోర్టును ఆశ్రయించగా, తాము కూడా న్యాయపోరాటం చేశామని తెలిపారు. ఈ క్రమంలో కోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఆలయాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై మళ్లీ కోర్టును ఆశ్రయించగా, ఆలయ నిర్మాణం పూర్తయ్యాకే ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు.

కొన్ని రోజుల క్రితం ఆలయ కమిటీలో సభ్యత్వం కోసం దరఖాస్తులు కోరగా తమవైపు నుంచే దరఖాస్తులు సమర్పించామని, అయితే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఏకగ్రీవంగా కమిటీ ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రమాణస్వీకారం నిర్వహించడం సరికాదన్నారు. ఎక్కడా లేని హడావుడి ఈ ఆలయం విషయంలో ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, దీనిని పూర్తి చేసేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గండ్ర జ్యోతి తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply