political | మమత కంచుకోటను బద్దలు కొట్టిన నేత బలం ఏమిటి?
political | మమత కంచుకోటను బద్దలు కొట్టిన నేత బలం ఏమిటి?
political | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాలంటే ఒకప్పుడు ఎడమపక్షాల ఆధిపత్యం.. ఆ తర్వాత మమతా బెనర్జీ దూకుడు. కానీ ఇప్పుడు ఆ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసిన పేరు సువేందు అధికారి. ఒకప్పుడు మమతకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఈ నాయకుడు.. ఇప్పుడు ఆమెకే అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థిగా ఎదగడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనమే.
సువేందు అధికారి బలం ఇదే..
సువేందు అధికారి బలం కేవలం ఓటు బ్యాంక్ కాదు.. గ్రౌండ్ లెవెల్ కనెక్టివిటీ. బెంగాల్ గ్రామీణ రాజకీయాల నాడిని పట్టుకున్న నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా తూర్పు మిద్నాపూర్, నందిగ్రామ్ ప్రాంతాల్లో ఆయన కుటుంబానికి బలమైన రాజకీయ పట్టు ఉంది. నిజానికి, మమతా బెనర్జీ సీఎం కావడానికి కారణమైన నందిగ్రామ్ ఉద్యమంలో సువేందు కీలక పాత్ర పోషించారు. రైతుల కోసం పోరాడిన నాయకుడిగా ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఏర్పడింది. అదే సమయంలో ఆయనకు ఉన్న పరిపాలనా అనుభవం, ఎన్నికల వ్యూహాల్లో నైపుణ్యం, స్థానిక స్థాయిలో పార్టీ కేడర్‌పై పట్టు ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయి. సువేందు మాట్లాడే భాష కూడా సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటుంది. పెద్ద పెద్ద సిద్ధాంతాల కంటే ప్రజల భావోద్వేగాల్ని టచ్ చేసే రాజకీయాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నారు.
అందుకే టీఎంసీ నుంచి బయటకు..
టీఎంసీలో ఒకప్పుడు నెంబర్-2 స్థాయిలో ఉన్న సువేందు.. క్రమంగా పార్టీకి దూరమయ్యాడు. దానికి ప్రధాన కారణంగా చెప్పేది అభిషేక్ బెనర్జీ ఎదుగుదల. మమతా బెనర్జీ తర్వాత పార్టీ మొత్తం తన మేనల్లుడు అభిషేక్ చుట్టూ తిరుగుతోందనే భావన సువేందులో పెరిగింది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆయన అనుచరులు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, టీఎంసీలో నిర్ణయాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయనే విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. సువేందు వంటి మాస్ లీడర్‌కు తగిన గౌరవం దక్కడం లేదనే అభిప్రాయం ఆయన వర్గంలో పెరిగింది. ఇలా రాజకీయ, వ్యక్తిగత విభేదాలు క్రమంగా పెరిగి.. చివరకు ఆయన టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు.
బెంగాల్‌లో బీజేపీ భవిష్యత్ ముఖచిత్రంగా…
బీజేపీకి బెంగాల్‌లో చాలా కాలం పాటు బలమైన స్థానిక ముఖం లేకపోయింది. అలాంటి సమయంలో సువేందు అధికారి ఎంట్రీ పార్టీకి భారీ బూస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో సువేందుకు ఉన్న మాస్ కనెక్టీవిటి బీజేపీకి అత్యంత అవసరమైంది. మమతా బెనర్జీని నేరుగా సవాల్ చేయగల నాయకులు బెంగాల్‌లో చాలా తక్కువ. కానీ సువేందు మాత్రం నందిగ్రామ్‌లోనే ఆమెను ఓడించి తన రాజకీయ శక్తిని నిరూపించారు. బీజేపీ జాతీయ రాజకీయాలను, బెంగాల్ స్థానిక భావజాలాన్ని కలిపి తీసుకెళ్లగల నేతగా సువేందును ప్రొజెక్ట్ చేసింది. అందుకే ఆయనను కేవలం మాజీ టీఎంసీ నేతగా కాకుండా.. “బెంగాల్‌లో బీజేపీ భవిష్యత్ ముఖచిత్రం”గా పార్టీ మలచింది.
మమతకు ప్రత్యామ్నాయ నాయకుడు..
ప్రజల్లో సువేందుపై ఏర్పడిన ప్రధాన నమ్మకం “మమతకు ప్రత్యామ్నాయం ఇవ్వగల నాయకుడు” అన్న భావన. బెంగాల్ రాజకీయాల్లో చాలా కాలం పాటు ప్రతిపక్షం బలహీనంగా కనిపించింది. కానీ సువేందు రావడంతో బీజేపీ కేడర్‌లోనే కాదు.. సాధారణ ప్రజల్లో కూడా కొత్త రాజకీయ పోటీ కనిపించింది. అలాగే, చట్టవ్యవస్థ, అవినీతి, రాజకీయ హింస వంటి అంశాలపై ఆయన దూకుడుగా మాట్లాడటం కొంతమందికి ఆకర్షణగా మారింది. పరిపాలనలో కఠిన నిర్ణయాలు తీసుకోగలడనే ఇమేజ్ కూడా ఆయనకు కలిసొచ్చింది. ముఖ్యంగా యువతలో “ఫైటర్ లీడర్”గా సువేందు ఇమేజ్ పెరిగింది. మమతను ఎదిరించే ధైర్యం ఉన్న నాయకుడు అనే అభిప్రాయం ఆయనకు రాజకీయంగా పెద్ద ప్లస్ అయింది.
సువేందు అధికారి ఎదుగుదల కేవలం ఒక నేత కథ కాదు.. బెంగాల్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల ప్రతిబింబం. ఒకప్పుడు మమతకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న నాయకుడు.. ఇప్పుడు ఆమెకు అతిపెద్ద సవాల్‌గా మారడం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే మాటను మరోసారి గుర్తు చేస్తోంది.
