మొక్కజొన్న కొనుగోళ్లలో అక్రమ వసూళ్లు..
- మార్కెట్ చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి
- రైతుల నుంచి అదనంగా వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇప్పించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ మండలం పెద్ద ముద్దనూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కజొన్న కొనుగోళ్లలో రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ జెడ్పీటీసీ శ్రీశైలం ఆధ్వర్యంలో రైతులు లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు.
ఫిర్యాదు ప్రకారం.. మొక్కజొన్న సంచులను తూకం వేసి లారీల్లో లోడ్ చేయడానికి ఒక్కో సంచికి రూ.26 చొప్పున చెల్లించే విధానం ఉండగా, మార్కెట్ చైర్మన్ రమణారావు మాత్రం ఒక్కో సంచికి రూ.40 చెల్లిస్తేనే లోడింగ్ చేపడతామని చెప్పి రైతుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు.
ఈ విషయాన్ని ప్రశ్నించగా, లారీ అన్లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఈ మొత్తం తీసుకున్నామని మార్కెట్ చైర్మన్ చెప్పినట్లు రైతులు తెలిపారు. అయితే దీనిపై సింగిల్ విండో సహకార సంఘం కార్యదర్శిని సంప్రదించగా, ఆ వసూళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులను ప్రశ్నించగా, రైతుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేయాలని తాము ఎలాంటి సూచనలు ఇవ్వలేదని వారు చెప్పినట్లు ఫిర్యాదులో వివరించారు.
రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన డబ్బులను వెంటనే తిరిగి ఇప్పించాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి మార్కెట్ చైర్మన్ రమణారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను రైతులు కోరారు.
