జై భీమ్ కాంబో మళ్లీ రిపీట్!

‘సూర్య-హోంబలే’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం.. వైరల్ అవుతున్న పూజా వేడుకల ఫొటోలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జై భీమ్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పూజా కార్యక్రమం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

‘జై భీమ్’ తర్వాత సూర్య, టీజే జ్ఞానవేల్ మరోసారి ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడంతో ఈ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుండటంతో పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్ర బృందం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించనున్నారు. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హీరోయిన్‌గా కాయదు లోహర్ నటించనుంది.

‘జై భీమ్’లో సామాజిక అంశాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన సూర్య–జ్ఞానవేల్ కాంబో ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకులను అలరించనుందో అన్న ఆసక్తి నెలకొంది. పూజా కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో వాటిని విస్తృతంగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టులు ట్రెండింగ్‌లో నిలిచాయి.