విద్యార్థుల ప్రతిభకు సినీ స్టార్స్ ప్రోత్సాహం..
విద్యార్థుల ప్రతిభకు సినీ స్టార్స్ ప్రోత్సాహం..
- 14న తుమ్పెనపేటకు విజయ్ దేవరకొండ-రష్మిక రాక
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, బాల్మూర్ మండలం, తుమ్పెనపేట గ్రామానికి ఈ నెల 14న ప్రముఖ తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ తెలుగు నటి రష్మిక మందన దంపతులు రానున్నట్లు మేనేజర్ కన్నారావు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ సినీ నటుల దంపతుల చేతుల మీదుగా స్కాలర్షిప్‌లు అందజేయనున్నారు. గతంలో వీరి వివాహ రిసెప్షన్ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
విద్యార్థుల్లో ఉన్నత విద్యపై ఆసక్తి పెంపొందించడం, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం లక్ష్యంగా ఈ స్కాలర్షిప్‌లను అందజేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గ విద్యార్థులకు ప్రోత్సాహాన్నివ్వడంతో పాటు, విద్యకు మరింత ప్రాధాన్యత చాటే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుందని స్థానికులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ తల్లిదండ్రులతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
