Thorrur ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. హెచ్ఎం శారదాదేవి

Thorrur ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.. హెచ్ఎం శారదాదేవి

తొర్రూరు (Thorrur), ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీపీఎస్ తొర్రూరు హెచ్ఎం శారదాదేవి అన్నారు. పాఠశాలల ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం డివిజన్ కేంద్రంలోని హరిపిరాల రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.

మామిడి తోరణాలు కట్టి, బెలూన్లు ఏర్పాటు చేసి, కరతాళ ధ్వనుల మధ్య పాటలు పాడుతూ చిన్నారులను పాఠశాలలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా హెచ్ఎం శారదాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు వంటి సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ బడులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడారంగాల్లో కూడా విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విమలాదేవి, రేణుక, దర్గా హుస్సేన్, రోజా, మౌనిక, మమత, పల్లవి తదితరులు పాల్గొన్నారు.