42-Workers-Safe : శ్రీసిటీ బస్సు దగ్ధం Andhra Prabha Crime News

42-Workers-Safe : శ్రీసిటీ బస్సు దగ్ధం Andhra Prabha Crime News

  • డ్రైవరు అప్రమత్తం
  • తప్పిన పెను ప్రమాదం
  • 42 మంది కార్మికులు సురక్షితం
  • తనిఖీలు కరువై పెరుగుతున్న ప్రమాదాలు
  • పరిశ్రమ బస్సుల భద్రతపై మరోసారి తలెత్తిన ప్రశ్నలు

(తడ, ఆంధ్రప్రభ):

42-Workers-Safe : తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని పరిశ్రమలకు కార్మికులను తరలిస్తున్న బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో మరో ప్రమాదం తృటిలో తప్పింది.

శనివారం తెల్లవారుజామున శ్రీ సిటీలోని ఐఎంఓపీ (IMOP) పరిశ్రమకు కార్మికులను తీసుకువస్తున్న బస్సు జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతి కావడంతో కలకలం రేగింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది కార్మికులు సురక్షితంగా బయటపడటం పెద్ద ఉపశమనంగా మారింది. సమాచారం మేరకు ఎస్‌బీఎల్‌టీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి ప్రాంతం నుంచి సుమారు 42 మంది కార్మికులతో శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో శ్రీ సిటీకి బయలుదేరింది.

బస్సు శ్రీ సిటీ జీరో పాయింట్ సమీపానికి చేరుకునే సమయంలో డీజిల్ అయిపోయిందని గుర్తించిన డ్రైవర్ సమీపంలోని పెట్రోల్ బంకుకు బస్సును నెమ్మదిగా తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి అందులో ఉన్న కార్మికులందరినీ కిందకు దింపాడు. అనంతరం సర్వీస్ రోడ్డులోకి బస్సును తీసుకెళ్లి ఆపాడు. అయితే కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి డీజిల్ ట్యాంకుకు అంటుకోవడంతో బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. మంటలు ఎగసిపడుతూ భారీగా పొగలు కమ్ముకోవడంతో జాతీయ రహదారిపై కొంతసేపు భయానక వాతావరణం నెలకొంది.

వాహనదారులు సైతం భయాందోళనలకు గురయ్యారు. సంఘటనపై సమాచారం అందుకున్న శ్రీ సిటీ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ బస్సులోని కార్మికులందరూ సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.