నవీన్ కుమార్ మృతిపై మేజిస్ట్రియల్ విచారణ జరపాలి

నవీన్ కుమార్ మృతిపై మేజిస్ట్రియల్ విచారణ జరపాలి
- డీఐజీ కి పిర్యాదు చేసినా ఎందుకంత జాప్యం..?
- పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదు
- రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రశ్నించిన సంఘాల నేతలు
-పోలీస్ స్టేషన్లో ఏ చట్ట ప్రకారం యువకుడిని కొడతారు..? - మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ:
దళిత యువకుడు వీధి నవీన్ కుమార్ మృతిపై మేజిస్ట్రియల్ విచారణ జరపాలని, డీఐజీ కి పిర్యాదు చేసినా ఎందుకంత జాప్యం చేస్తున్నారని దళిత, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రశ్నించారు. ఉండి మండలం పాందువ్వ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వీధి నవీన్ కుమార్ మృతిపై శుక్రవారం భీమవరంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఏ చట్ట ప్రకారం యువకుడిని కొడతారని ప్రశ్నించారు. ఎలాంటి నేరం చేసిన వారినైనా పోలీసులు కొట్టడానికి హక్కు లేదని తెలిపారు. పోలీసులు చట్టాన్ని దిక్కరించడమే అవుతుందన్నారు. ఆకివీడు సీఐ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దళిత యువకుడిని దారుణంగా కొట్టారని అందుకు ఆ యువకుడు తన తల్లికి చెప్పడమే సాక్ష్యమన్నారు. వీధి నవీన్ రౌడీ షీటర్, దురుసు ప్రవర్తన అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని ఇది కేవలం పోలీసు పాత్ర లేకుండా చేయడానికి చేసే కుట్ర అని ఆరోపించారు.
నవీన్ కి ఒకవైపు కుటుంబ కలహాలు ఉన్నాయని, మరోవైపు పోలీసులు కొట్టడం ఈ రెండు ఘటనలు వలన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. నిజనిజాలేమిటో తెలవాలంటే ఈ ఘటనపై తక్షణం మేజిస్ట్రియల్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ విచారణలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి జే ఎన్ వి గోపాలన్ మాట్లాడుతూ వీధి నవీన్ కుమార్ మృతిపై జిల్లా పోలీస్ యంత్రాంగం పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. మృతుని తల్లి వీధి బుజ్జి తన కుమారుడు చివరి క్షణంలో అన్ని విషయాలు చెప్పినట్లు తెలిపారన్నారు. ఉండి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లు డబ్బు, రాజకీయ బలం, సామాజిక హోదా ఉన్న వారికే న్యాయం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన నిష్పాక్షికంగా నిలబడాల్సిన పోలీసులు రాజకీయ నాయకుల ప్రమేయంతో వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేశారు. తల్లి కోరుతుంటున్నట్లుగా నవీన్ కుమార్ మృతిపై మేజిస్ట్రియల్ విచారణ జరపి, కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ నవీన్ కుమార్ ఆత్మహత్య ఘటన విచారకరమన్నారు. కుటుంబ కలహాలు ఉంటే రాజకీయ ప్రమేయంతో దళిత యువకుడిని స్టేషన్ లో ఎలా కొడతారన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు, గ్రామ రెవెన్యూ సంఘం గౌరవాధ్యక్షులు మల్లిపూడి ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా నాయకులు గొర్ల రామకృష్ణ మాట్లాడారు.
ఈ సమావేశానికి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అధ్యక్షత వహించగా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనికొండ శ్రీనివాస్ ముగించారు. ఈ సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి, దళిత నేతలు పట్టెం సుభాకర్, గొల్ల రాజ్ కుమార్, సుదీప్, తదితరులు పాల్గొన్నారు.
