మాధవాయపాలెం ఫెర్రీ భద్రతపై ఆకస్మిక తనిఖీ

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం..

నిబంధనలు కచ్చితంగా పాటించాలని జెడ్పీ సీఈఓ జగదాంబ ఆదేశం

నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురం మండలంలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవును జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పి. జగదాంబ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫెర్రీ నిర్వహణ, ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఫెర్రీపైకి వెళ్లి లైఫ్ జాకెట్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేసిన సీఈఓ, నీటి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల సమయంలో అనుసరించాల్సిన చర్యలపై నిర్వాహకులకు సూచనలు చేశారు. ఫెర్రీ ఫిట్‌నెస్ రికార్డులు, టికెట్ ధరలు, ఒక్కో ట్రిప్‌లో ప్రయాణించే వారి సంఖ్య తదితర అంశాలపై ఆరా తీశారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఫెర్రీ నిర్వహణ సాగాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లైఫ్ జాకెట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, నిర్ణయించిన సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అలాగే సంబంధిత లీజుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించాలని సూచించారు.

అనంతరం నర్సాపురం మండలంలోని రుస్తుంబాద గ్రామపంచాయతీలో స్వచ్ఛరథం వెరిఫికేషన్ కార్యక్రమాన్ని సీఈఓ జగదాంబ పరిశీలించారు. స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్న పొడి వ్యర్థాలు, పేపర్లు, పాత పుస్తకాల సేకరణ విధానాన్ని పరిశీలించి, డ్రై వేస్ట్ సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని డ్రైవర్‌కు సూచనలు చేశారు.

తదుపరి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూఎంపీసీ షెడ్‌ను సందర్శించి, తడి, పొడి వ్యర్థాల వేరు చేసే విధానం, వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలను పరిశీలించారు. అలాగే ఎన్‌ఏడీఈపీ గుంతల ద్వారా తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో ఎంపీడీఓ ఎం. నాసరురెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.