గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

మోత్కూర్, ఆంధ్రప్రభ: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ ఆరోపించారు. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడు మోత్కూర్ ప్రకాశం శర్మ 10వ వర్ధంతి సందర్భంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సెమినార్ నిర్వహించారు.

సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జహంగీర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచి, వి.బి.జీ. రాంజీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధుల్లో 60 శాతం భరించాలని నిబంధన పెట్టిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని ముఖ్యమంత్రి చెబుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

మోత్కూర్ ప్రకాశం శర్మ నిరంతర పోరాట యోధుడని, కూలీల సమస్యలపై పోరాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా చివరి వరకు పనిచేశారని కొనియాడారు. ఆయన వర్ధంతి కార్యక్రమాలను గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వి.బి.జీ. రాంజీ చట్టాన్ని రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 12న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, 5వ వార్డు కౌన్సిలర్ అనురాధ, సీపీఎం సీనియర్ నాయకులు ఫైళ్ల యాదిరెడ్డి, నాగిరెడ్డి, గుండాల, ఆత్మకూరు, అడ్డగూడూరు మండల కార్యదర్శులు మద్దెపురం రాజు, వేముల బిక్షం, బుర్రు అనిల్ కుమార్, సీనియర్ నాయకులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు, ప్రకాశం శర్మ కుటుంబ సభ్యులు మోత్కూర్ ప్రదీప్ శర్మ, సందీప్ శర్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.