అల‌ర్ట్.. మరో రెండు గంటల్లో వ‌ర్షాలు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆలస్యమైన నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురవడంతో కొంత ఉపశమనం లభించింది. ఇక ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రానున్న రెండు గంటల్లో అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ వర్షాలు రైతులకు, ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఊరట కలిగించే అవకాశం ఉంది.

హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు గంటల్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచ‌నా వేశారు.

అదేవిధంగా యాదాద్రి-భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని మరిన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.