అడిగిన బ్రాండ్లు మాయం..! బెల్ట్ షాపులకు మద్యం మళ్లింపు..?

  • వైన్ షాపుల ముందు మద్యం ప్రియుల ఆందోళన
  • బెల్ట్ షాపుల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం
  • ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు

గణపురం, ఆంధ్రప్రభ : గణపురం మండల కేంద్రంలోని భద్రకాళి వైన్స్, శ్రీ మల్లిఖార్జున వైన్స్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదివారం మద్యం ప్రియులు వైన్ షాపుల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లో వినియోగదారులు అడిగిన బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకపోవడం, అదే మద్యం బెల్ట్ షాపులకు తరలిస్తున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల కేంద్రంలో రెండు లైసెన్స్‌డ్ వైన్ షాపులు ఉన్నప్పటికీ, ఒక దుకాణాన్ని బెల్ట్ షాపుల సరఫరా కేంద్రంగా మార్చి గ్రామాలకు పెద్దఎత్తున మద్యం తరలిస్తున్నారని ఆరోపించారు. మరో షాపులో మద్యం ప్రియులు ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ బీర్లు, ప్రముఖ మద్యం బ్రాండ్లు విక్రయించకుండా ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో తాము గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో అదే మద్యాన్ని రెట్టింపు ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధరలకు దొరకాల్సిన మద్యం అక్రమంగా బెల్ట్ షాపులకు మళ్లించి అక్రమ లాభాలు పొందుతున్నారని ఆరోపించారు.

జిల్లా ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి లైసెన్స్ షాపుల్లో అన్ని రకాల బ్రాండ్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపులపై విచారణ జరిపి అవసరమైతే లైసెన్స్ రద్దు చేసి కొత్త లైసెన్స్‌లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో చేసినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలమైందని మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.