సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి కొత్త కార్యాచరణ
- రుణభారం తగ్గించి తక్కువ వడ్డీతో నిధుల సమీకరణకు ప్రణాళిక
- 10 రోజుల్లో ఫండింగ్ రోడ్‌మ్యాప్..
- బడ్జెట్‌పై ఆధారపడకుండా ఆదాయ వనరులు పెంచాలని మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, రుణభారం తగ్గింపు, నిధుల సమీకరణపై విస్తృతంగా చర్చించారు. సాగునీటి సంస్థలకు సంబంధించిన సమగ్ర ఫండింగ్ రోడ్‌మ్యాప్‌ను 10 రోజుల్లో సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అధిక వడ్డీ రుణాలను తగ్గించి తక్కువ వడ్డీతో కొత్త నిధులను సమీకరించే మార్గాలపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
బడ్జెట్‌పై ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులు
కేవలం ప్రభుత్వ బడ్జెట్‌పై ఆధారపడకుండా సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులను సృష్టించాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సాగునీటి శాఖకు చెందిన ఖాళీ భూముల్లో భారీ స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ చర్యల వల్ల రైతులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం తీసుకున్న అధిక వడ్డీ రుణాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా రాష్ట్ర ఖజానాపై భారాన్ని తగ్గించే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు, అందుబాటులో ఉన్న నిధులు, పనుల పురోగతిని వివరిస్తూ సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం
ఎన్నో ఏళ్లపాటు కొనసాగుతున్న భారీ ప్రాజెక్టుల కంటే తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే, రైతులకు వెంటనే సాగునీరు అందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సాగునీటి శాఖకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములు, ఇతర ఆస్తుల పూర్తి వివరాలను 15 రోజుల్లోగా సేకరించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిధులు విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు.
