అబుదాబి నుంచి భారత్‌కు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్లు..

ఆంధ్రప్రభ : భారతీయ ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్‌కు నేరుగా నడిపే విమాన సర్వీసులను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం 17 భారతీయ నగరాలకు అందుబాటులో ఉన్న డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ఆగస్టు నుంచి… 22 నగరాలకు పెంచనున్నట్లు అబుదాబి ఎయిర్‌పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కార్స్టెన్ నార్లాండ్ తెలిపారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నవి ముంబై, ఇండోర్, లక్నో నుంచి అబుదాబికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించగా, వచ్చే నెల నుంచి గువాహటి నుంచి కూడా కొత్త సర్వీసులు ప్రారంభించనుంది.

భారత్ కీలక మార్కెట్…

భారత్ నుంచి అబుదాబికి ప్రయాణించే వారి సంఖ్య ప్రతి ఏడాది 20 శాతానికి పైగా పెరుగుతోందని కార్స్టెన్ నార్లాండ్ తెలిపారు. ప్రస్తుతం అబుదాబి విమానాశ్రయాన్ని వినియోగించే మొత్తం ప్రయాణికుల్లో భారతీయుల వాటా దాదాపు 24 శాతం ఉండగా, వారి సంఖ్య సుమారు 70 లక్షలు అని పేర్కొన్నారు.

భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభించేందుకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, భారత్-యూఏఈ మధ్య ఉన్న ద్వైపాక్షిక విమాన రాకపోకల హక్కుల (ట్రాఫిక్ రైట్స్) పరిమితుల కారణంగా సేవల విస్తరణకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ భారత మార్కెట్‌కు మరింత ప్రాధాన్యం ఇస్తూ కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.