నాగాలాండ్‌లో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. 8మంది మృతి..

  • ఎడతెరిపి లేని వర్షాలతో మోన్ జిల్లాలో విషాదం
  • శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం..
  • సహాయక చర్యలు కొనసాగింపు

ఆంధ్రప్రభ : నాగాలాండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మోన్ జిల్లాలో పలుచోట్ల భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు ఎనిమిది మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అధికారుల సమాచారం ప్రకారం, భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే నిరంతర వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

మోన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వెన్న్యేయ్ కొన్యాక్ మాట్లాడుతూ… పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సహాయక సిబ్బంది, జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ ప్రాంతాలు, నదీ తీరాలు, భూస్ఖలనాలకు గురయ్యే ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.