సాంకేతిక కోర్సుల వైపు విద్యార్థులు దృష్టి సారించాలి
సాంకేతిక కోర్సుల వైపు విద్యార్థులు దృష్టి సారించాలి
చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసారావు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా వంద శాతం ఉపాధి గ్యారెంటీ ఇచ్చే సాంకేతిక వృత్తి విద్యా కోర్సులను ఎంచుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసారావు పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ మండలంలో హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సు విశిష్టతను, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. “నేటి ఆధునిక కాలంలో చేనేత రంగం కేవలం మగ్గానికి మాత్రమే పరిమితం కాలేదు. ఐఐహెచ్ టి ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, టెక్స్‌టైల్ టెస్టింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి ఆధునిక అంశాల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు.
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధికి కూడా మార్గాలు ఉన్నాయని వివరించారు . చేనేత రంగంలో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉందని, ఈ కోర్సు కు 10వ తరగతి అర్హత, 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ శిక్షణ, ప్రభుత్వ స్టైపెండ్ సౌకర్యం,100 శాతం ఉపాధి అవకాశాలు ఉంటాయని, విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.
