Car Roof Stunt | కారు రూఫ్‌పై ప్రయాణం..

ఇద్దరిపై కేసు నమోదు
వైరల్ వీడియోపై స్పందించిన ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీసులు
అనుమతులు లేకుండా వాహన మార్పులు, ప్రమాదకర డ్రైవింగ్‌పై కఠిన చర్యలు

Car Roof Stunt | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో కారు పైకప్పుపై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. టీజీ 08 ఏజీ 92XX నంబర్ కారును జి. సాయి తరుణ్ ఆర్‌జీఐఏ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై నడుపుతుండగా, వి. లక్ష్మీ ప్రియాంక కారు పైకప్పుపై కూర్చొని ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాహన డ్రైవర్ సాయి తరుణ్, కారు పైకప్పుపై ప్రయాణించిన లక్ష్మీ ప్రియాంకపై బీఎన్‌ఎస్ సెక్షన్ 125, 3(5) కింద చర్యలు తీసుకున్నారు. అనుమతులు లేకుండా వాహనాల్లో మార్పులు చేయడం, రహదారులపై ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.