ఫిఫా ఫైనల్‌కు కౌంట్‌డౌన్.. చరిత్ర సృష్టించేది ఎవరు?

  • అర్థరాత్రి అర్జెంటీనా-స్పెయిన్ మహా సమరం
  • మెస్సీపై ప్రపంచం చూపు..
  • వరుసగా రెండో కప్ లక్ష్యంగా అర్జెంటీనా
  • రెండో ప్రపంచకప్ కోసం స్పెయిన్ పోరు..

ఆంధ్రప్రభ : ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ చాంపియన్ స్పెయిన్ ఆదివారం అర్థరాత్రి తలపడనున్నాయి. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని మెట్లైఫ్ స్టేడియం (న్యూయార్క్–న్యూజెర్సీ ప్రాంతం) ఈ చారిత్రక పోరుకు వేదిక కానుంది.

అందరి చూపు మెస్సీపైనే..

అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది. ఈ టోర్నీలో ఇప్పటికే ఎనిమిది గోల్స్, నాలుగు అసిస్టులతో అద్భుత ఫామ్‌లో ఉన్న మెస్సీ.. అర్జెంటీనాకు వరుసగా రెండో ప్రపంచకప్ అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. అర్జెంటీనా ఈ ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫైనల్‌లోనూ గెలిస్తే 100 శాతం విజయాలతో ప్రపంచకప్ గెలిచిన అరుదైన జట్ల సరసన నిలవడంతో పాటు, వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో దేశంగా చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ ఘనతను ఇటలీ, బ్రెజిల్ మాత్రమే సాధించాయి.

స్పెయిన్ గురి రెండో ప్రపంచకప్

2010 తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన స్పెయిన్.. రెండో టైటిల్‌పై కన్నేసింది. సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన స్పేయిన్.. ఈ టోర్నీలో అసాధారణ డిఫెన్స్ టెక్నీక్స్ తో ఆకట్టుకుంది. గోల్‌కీపర్ ఉనాయ్ సిమోన్ ఏడు మ్యాచ్‌ల్లో ఆరు క్లీన్ షీట్లు నమోదు చేసి ప్రపంచకప్ రికార్డు నెలకొల్పాడు. అలాగే స్పెయిన్ వరుసగా 37 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా దూసుకెళ్తోంది.

ఇక‌, ఇప్ప‌టివ‌ర‌కు అర్జెంటీనా ఇప్పటివరకు ఆరు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడి మూడు సార్లు (1978, 1986, 2022) ఛాంపియన్‌గా నిలిచింది.
స్పెయిన్ మాత్రం తన చరిత్రలో ఒక్కసారి మాత్రమే ప్రపంచకప్ ఫైనల్ ఆడి, 2010లో నెదర్లాండ్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు రెండో కప్ కోసం బరిలోకి దిగుతోంది.

గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ

ఫిఫా ప్రపంచకప్-2026 ఫైనల్‌కు ముందు గోల్డెన్ బూట్ పోరు ఆసక్తికరంగా మారింది. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే ఈ అవార్డు రేసులో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. ఎంబాప్పే ఖాతాలో 10 గోల్స్, 4 అసిస్టులు ఉండగా.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ 8 గోల్స్, 4 అసిస్టులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

గోల్డెన్ బూట్‌ను నేరుగా సొంతం చేసుకోవాలంటే మెస్సీ ఫైనల్‌లో హ్యాట్రిక్ నమోదు చేయాల్సి ఉంటుంది. రెండు గోల్స్‌తో పాటు ఒక అసిస్టు అందించినా ఎంబాప్పేను అధిగమించే అవకాశం ఉంటుంది. అయితే కేవలం రెండు గోల్స్ మాత్రమే చేస్తే గోల్స్, అసిస్టులు సమానమవుతాయి. అలాంటి పరిస్థితిలో తక్కువ నిమిషాలు ఆడిన ఆటగాడికి ప్రాధాన్యం లభించే టైబ్రేకర్ వర్తించనుండగా, ప్రస్తుతం ఆ అంశంలో ఎంబాప్పేకే ఆధిక్యం ఉంది.

ప్రపంచకప్ చరిత్రలో కేవలం ఎనిమిది దేశాలే ఛాంపియన్లు

1930లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాయి. అత్యధికంగా బ్రెజిల్ ఐదుసార్లు టైటిల్ గెలుచుకుని అగ్రస్థానంలో ఉంది. జర్మనీ, ఇటలీ చెరో నాలుగు సార్లు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నాయి. అర్జెంటీనా మూడు సార్లు విజేతగా నిలవగా, ఫ్రాన్స్, ఉరుగ్వే చెరో రెండు టైటిళ్లు గెలిచాయి. ఇంగ్లండ్, స్పెయిన్ ఒక్కోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఈ ఎనిమిది దేశాలే ఇప్పటివరకు ప్రపంచకప్ విజేతలుగా చరిత్ర సృష్టించాయి.