లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ వీరవిహారం..
- సునామీ సెంచరీ
- రోహిత్ రికార్డుల మోత..
- ఆ రికార్డులన్నీ రోహిత్ ఖాతాలో..
లండన్, ఆంధ్రప్రభ : లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత సీనియర్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో చెలరేగాడు. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 84 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో శుభ్‌మన్ గిల్‌తో కలిసి భారత్‌కు అద్భుత పునాది వేసిన రోహిత్.. గిల్ ఔటైన తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. గిల్ 84 బంతుల్లో 77 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరగగా, అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి స్కోరు వేగాన్ని మరింత పెంచాడు రోహిత్. కోహ్లీ కూడా వేగంగా పరుగులు రాబట్టడంతో భారత ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది. దీంతో టీమిండియా కేవలం 30.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. భారీ లక్ష్య ఛేదనలో అవసరమైన రన్‌రేట్‌ను అందుకుంటూ ఇంగ్లండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచింది.
రోహిత్ ఖాతాలో వరుస రికార్డులు..
ఇంగ్లండ్ పై రోహిత్ శర్మ సాధించిన ఈ శతకంతో… పలు అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 46 సెంచరీలతో రెండో స్థానానికి చేరుకున్నాడు రోహిత్. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (49) తొలి స్థానంలో ఉండగా, సచిన్ టెండూల్కర్ (45)ను రోహిత్ అధిగమించాడు.
ఇక, ఇంగ్లండ్ గడ్డపై అతిథి జట్టు ఆటగాడిగా అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో 10 సెంచరీలతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (11) ముందుండగా, వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ (9)ను హిట్ మ్యాన్ వెనక్కి నెట్టాడు.
అలాగే, లార్డ్స్‌లో వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా చరిత్ర సృష్టించాడు. 2004లో సౌరవ్ గంగూలీ చేసిన 90 పరుగుల రికార్డును అధిగమిస్తూ మూడు అంకెల స్కోరుతో కొత్త మైలురాయిని నెలకొల్పాడు.
- అదిరిన భాగస్వామ్యాలు…
రోహిత్, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు అద్భుత ఆరంభాన్ని అందించారు. అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు వేగంగా పరుగులు జోడిస్తూ లక్ష్య ఛేదనను మరింత ఆసక్తికరంగా మార్చాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించే పోరులో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతుండటంతో లార్డ్స్‌లో అభిమానులకు ఉత్కంఠభరిత పోరు కనిపిస్తోంది. రోహిత్ శర్మ చారిత్రక శతకం టీమిండియా విజయావకాశాలను మరింత బలపరిచింది.
