ఇంట్లో చోరీ చేసిన మహిళ అరెస్ట్
బిక్కనూర్, ఆంధ్రప్రభ: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. నిందితురాలి వద్ద నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
శనివారం బిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్ల స్వామి ఈ నెల 16న వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లగా, ఆయన భార్య విజయ ఇంట్లోని బీరువాలో ఆరు తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదును ఉంచి ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు తెలిపారు.
సాయంత్రం తిరిగి వచ్చి చూడగా ఇంటి బయట తాళాలు యథావిధిగా ఉన్నప్పటికీ, లోపల గదులు, బీరువాలు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చిందన్నారు. బీరువాలో ఉన్న నగలు, నగదు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీఐ నరేష్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించిన అనంతరం గ్రామానికి చెందిన దొడ్ల లతను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు.
నిందితురాలి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
కేవలం రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో సీఐ నరేష్, ఎస్సై అనిల్, ఏఎస్సై వెంకట్రావు, పోలీసు సిబ్బంది శ్రీకాంత్, కిషన్ గౌడ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
