దిమ్మదుర్తి అండర్‌పాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మామడ, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ మండలంలోని కౌట్ల (కే) గ్రామానికి చెందిన వీరేశం స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్ అతడికి సహాయం చేసేందుకు వాహనాన్ని ఆపాడు.

అయితే అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వీరేశంకు మోకాలికి గాయాలు కాగా, కారులో ఉన్న మామడ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన గంగారాం తలకు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.