పార్లమెంట్‌లో రేపు రెండు కీలక బిల్లులు..

  • వర్షాకాల సమావేశాల తొలి రోజే కీలక చట్టాలకు శ్రీకారం..
  • తొలి రోజే రెండు కీలక బిల్లులు
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు..
  • వందేమాతరానికి జాతీయ గీత హోదాపై బిల్లు..
  • వాడివేడిగా సాగనున్న సమావేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం (జూలై 20) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎనిమిది కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే, రేపు తొలి రోజే రెండు ముఖ్యమైన బిల్లులు సభ ముందుకు రానుండటంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు నీట్ పేపర్ లీక్, అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారం, మణిపూర్ పరిస్థితులు, సోనం వాంగ్‌చుక్ నిరసన వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి రోజే రెండు కీలక బిల్లులు

లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో 1956 సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆమోదిత న్యాయమూర్తుల సంఖ్యను ఈ చట్టమే నిర్ణయిస్తోంది. న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పెరుగుతున్న కేసుల భారాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

అటు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026’ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో 1971లో అమల్లోకి వచ్చిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందేమాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పించే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై సభలో ఆసక్తికర చర్చ జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం జాతీయ జెండా, భారత రాజ్యాంగం, జాతీయ గీతాన్ని అవమానించే చర్యలకు శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయి. జాతీయ చిహ్నాల గౌరవాన్ని మరింత బలోపేతం చేయడానికి గతంలో కూడా ఈ చట్టంలో సవరణలు చేశారు.

అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం

సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఉభయ సభల్లో ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వాదనలను వినాలని కోరారు. ప్రస్తుతం ఎనిమిది బిల్లుల జాబితానే సిద్ధంగా ఉందని, అవసరమైతే కొత్త బిల్లులను ప్రవేశపెట్టే ముందు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించి ప్రతిపక్షాలకు సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల డిమాండ్లు

వర్షాకాల సమావేశాలకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో పాటు 40 రాజకీయ పార్టీలకు చెందిన 58 మంది నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీక్, అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం, మణిపూర్ పరిస్థితులు, పెట్రోల్‌లో ఈ20 ఇంధన మిశ్రమం, సోనం వాంగ్‌చుక్ నిరసన వంటి అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ఆధారంగానే అమలు చేయాలని డీఎంకే కోరింది.

వాడివేడిగా సాగనున్న సమావేశాలు

కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించాలని భావిస్తుండగా, ప్రజా సమస్యలు, రాజకీయ అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో, రేప‌టి నుంచి (జూలై 20న) ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించనున్నాయి.