అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య
చెన్నూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ చంద్రయ్య హెచ్చరించారు.
ఆదివారం చెన్నూర్ పట్టణంలోని 1, 8 వార్డుల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి బిల్లులు సక్రమంగా అందుతున్నాయా, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. ఈ పథకం అమలులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు.
ప్రిసీడింగ్‌ల పేరుతో లేదా ఇతర కారణాలు చూపించి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
