తప్పుడు కేసులతో ఇంటి స్థలం ఆక్రమించొద్దు

నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని సీపీఐ డిమాండ్

మర్రిగూడ, ఆంధ్రప్రభ : తప్పుడు కేసులు నమోదు చేసి పేదల ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ డిమాండ్ చేశారు.

సోమవారం ఖుదాబక్షపల్లి గ్రామంలో సీపీఐ గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి చెందిన 188 గజాల ఇంటి స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని అక్కడ మహిళా సమైక్య భవన నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

స్థల యజమాని బొంత మల్లేష్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, మండల అధికారులు, గ్రామ సర్పంచ్ స్పందించకుండా నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ఇంటి స్థల వివాదంపై ఎంపీడీఓ, తహసీల్దార్ రెండు విడతలుగా విచారణ నిర్వహించగా, ఆ స్థలం పూర్వం నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కుటుంబానిదేనని గ్రామ పెద్దలు, స్థానికులు తెలిపినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు వాస్తవాలను పక్కనబెట్టి తప్పుడు నివేదికలను జిల్లా అధికారులకు పంపుతున్నారని ఆరోపించారు.

పంచాయతీ కార్యదర్శి సంతకాల ఫోర్జరీ కేసులో నిందితుడిగా పేర్కొన్న వ్యక్తి తన పేరు కూడా స్వయంగా రాయలేని పరిస్థితిలో ఉన్నాడని, అలాంటి వ్యక్తిపై ఫోర్జరీ కేసు నమోదు చేయడం అన్యాయమని బూడిద సురేష్ అన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.

ఇంటి స్థల వివాదంపై బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అయినప్పటికీ ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను అమలు చేసి, నిజమైన హక్కుదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బాధితులకు న్యాయం జరిగే వరకు అన్ని స్థాయిల్లో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు ఇస్కిళ్ల మహేందర్, గ్రామశాఖ కార్యదర్శి మేతరి యాదయ్య, సీనియర్ నాయకుడు ఎర్రజాల మహేందర్, సహాయ కార్యదర్శి యాదగిరి, ఏఐవైఎఫ్ మండల సహాయ కార్యదర్శి పొట్ట అశోక్, జంగిలి వెంకన్న, బొమ్మరగొని హనుమంతు, గోగు శేఖర్, గోల్కొండ లింగం, నాయకులు, బాధితులు పాల్గొన్నారు.