కాగితాల్లో ‘భగీరథ’ ప్రవాహం.. క్షేత్రస్థాయిలో ‘రసాయన’ విషాదం!
కాగితాల్లో ‘భగీరథ’ ప్రవాహం.. క్షేత్రస్థాయిలో ‘రసాయన’ విషాదం!
- బావుల్లో నీరున్నా సాగు చేయలేని దైన్యం..
- నిజాలు దాచాలంటూ జనాభా లెక్కల ఎన్యుమరేటర్లపై అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు
- ప్రజలకు వారానికోసారి .. రసాయన పరిశ్రమలకు మాత్రం ప్రతిరోజు సరఫరా?
- ఆర్వో ప్లాంట్ల నీటితో గ్రామస్తుల ప్రాణాలకే ముప్పు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
ప్రభుత్వ రికార్డుల్లో గ్రామాలకు ‘మిషన్ భగీరథ’ నీళ్లు పుష్కలంగా పారుతున్నాయి. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉన్నట్లు కాగితాలు చెప్తున్నాయి. కానీ, క్షేత్రస్థాయికి వెళ్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పలు గ్రామాలలో పారేది మిషన్ భగీరథ జలాలు కాదు.. రసాయన పరిశ్రమలు చిమ్మిన విషపు జలాలు! అటు సాగు భూములు నాశనమై, ఇటు తాగేందుకు చుక్క మంచి నీరు దొరక్క ఒకవైపు ప్రజలు అల్లాడుతుంటే.. వాస్తవాలను కప్పిపుచ్చి రికార్డులను ఫోర్జరీ చేయించేందుకు ఉన్నతాధికారులు వేస్తున్న స్కెచ్‌లు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
రికార్డులు మార్చాలంటూ అధికారుల హుకుం! ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల (సెన్సస్) ప్రక్రియలో అధికారుల బాగోతం బట్టబయలైంది. గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడం లేదు. గ్రామానికి సమీపంలో ఉన్న చిన్న చిన్న హ్యాబిటేషన్లు (బావుల దగ్గర నివాసం ఉండే ఇండ్లు) కి అసలు భగీరథ నీటి ఊసే లేదు. అయినప్పటికీ, రికార్డులలో మాత్రం ‘ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందుతోంది’ అని నమోదు చేయాలంటూ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యుమరేటర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ పథకం వంద శాతం విజయవంతమైందని నివేదికలు పంపడం కోసం.. సామాన్య సిబ్బందిని బలిపశువులను చేస్తూ అబద్ధపు రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పరిశ్రమల కాలుష్యం.. పడావు పడ్డ పంట భూములు! ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన పల్లెలు.. ఇప్పుడు పడావు భూములుగా (ఎడారిగా) మారిపోతున్నాయి. ప్రధానంగా డివిజన్ లోని అంతమ్మగూడెం, దోతిగూడెం, డి నాగారం, తంగడపల్లి, ఆరెగూడెం తదితర గ్రామాలలోని వ్యవసాయ బావులు, బోర్ల నిండా నీరు ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉన్న రసాయన పరిశ్రమలు వదులుతున్న కాలుష్య వ్యర్థాల వల్ల ఆ నీరంతా పూర్తిగా విషతుల్యమైంది. బావుల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. ఆ నీటిని ముట్టుకుంటే పంటలు మాడిపోతున్నాయి. దీంతో విధిలేని పరిస్థితిలో రైతులు వరి సాగును నిలిపివేసి, చేతులు జోడించి కూర్చున్నారు. భూగర్భ జలాలు ఎంత దారుణంగా కలుషితమయ్యాయంటే.. కనీసం పారిశ్రామిక అవసరాలకు కూడా పనికిరానంతగా ఆ నీరు రంగు, రుచి మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల కంటే పరిశ్రమలే ఎక్కువయ్యాయా?
గ్రామస్తుల తాగునీటి అవసరాల కోసం వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే మిషన్ భగీరథ నీళ్ళని ఇస్తున్న అధికారులు.. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలకు మాత్రం పారిశ్రామిక అవసరాల కోసం నిరంతరాయంగా భగీరథ నీళ్లను సరఫరా చేస్తున్నారని, ప్రజల ప్రాణాల కంటే పరిశ్రమల ప్రయోజనాలే అధికారులకు ముఖ్యం కావడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఆర్వో ప్లాంట్లను నమ్ముకుంటే రోగాల బారిన..
మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు తప్పనిసరి పరిస్థితుల్లో కలుషితమైన భూగర్భ జలాలనే స్థానిక వాటర్ ప్లాంట్ల (ఆర్వో ప్లాంట్స్) ద్వారా శుద్ధి చేసుకుని తాగుతున్నారు. అయితే, సాధారణ ఆర్వో ప్లాంట్లు నీటిలోని రసాయనాలను, హెవీ మెటల్స్‌ను పూర్తిగా తొలగించలేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రసాయన జలాలను తాగడం వల్ల గ్రామస్తుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. కిడ్నీ వ్యాధులు, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులతో ప్రతి ఇల్లూ ఒక రోగాల నిలయంగా మారుతోంది.
తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి..
ఒకవైపు సాగు భూములు నాశనమై రైతులు రోడ్డున పడ్డారు.. మరోవైపు రసాయన జలాలు తాగి ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఈ ఘోరాలన్నింటినీ దాచిపెట్టి రికార్డుల్లో ‘సబ్ కా బల్లా’ అని రాపించుకోవాలని చూస్తున్న అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి, తప్పుడు రికార్డుల నమోదును అడ్డుకోవాలని, కాలుష్యకారక రసాయన పరిశ్రమలపై చర్యలు తీసుకుని, గ్రామానికి ప్రతిరోజూ మిషన్ భగీరథ నీటిని అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
