బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు
ముగ్గురు అరెస్ట్.. మరో తొమ్మిది మంది కోసం గాలింపు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ ఆధార్ కార్డులతో తొమ్మిదేళ్లుగా ఏడు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన మహమ్మద్ జానీ అలీ, మహమ్మద్ రొమాన్స్ అలీ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జానీ అలీ 12 మంది సభ్యులతో ముఠాను ఏర్పాటు చేసి రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.
జూలై 11న బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన ఈ ముఠా సభ్యులు ముందుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మోటార్ సైకిళ్లు, కార్లు చోరీ చేసి, అనంతరం తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చేరుకుని దొంగతనాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
ప్రధాన నిందితుడు మహమ్మద్ జానీ అలీ గతంలో మధ్యప్రదేశ్‌లో నమోదైన ఓ చోరీ కేసులో అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించినట్లు ఎస్పీ తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన మరో 12 మంది సభ్యులతో వీరికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
కుక్కర్లు అమ్ముతూ రెక్కీ.. రాత్రిళ్లు చోరీలు
ఈ ముఠా సభ్యులు పగటి సమయంలో కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ నేత ఇంట్లో చోరీ సొత్తు స్వాధీనం
ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్‌నగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఇటీవల ఈ ముఠా చోరీకి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.8 లక్షల విలువైన 73.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, ఐఫోన్లు, ఐప్యాడ్‌తో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో మహమ్మద్ జానీ అలీ, మహమ్మద్ రొమాన్స్ అలీ, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన తరుణ్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో తొమ్మిది మంది సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన మావల సీఐ బీడీ ప్రేమ్‌కుమార్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణ, సిబ్బంది త్రిశూల్, శ్రీనివాస్ తదితరులను ఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
