ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం

  • మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; పేద, మధ్యతరగతి ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, ప్రభుత్వ వైద్యశాలల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా మంత్రి తనిఖీ చేశారు రోగులకు అందుతున్న సేవలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరిస్తూ, ఆసుపత్రికి నేటి నుంచే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ దవాఖానాల్లోనే అన్ని వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా ఆధునిక వైద్య సేవలు, పరీక్షలు, నాణ్యమైన మందులు ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిలో త్వరలోనే పూర్తిస్థాయి సేవలను మరింత విస్తృతం చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ అంతరాయం కారణంగా డయాలసిస్ రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వారి కోసం ప్రత్యేక విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. నేటి నుంచి ఎలాంటి బ్రేక్ లేకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. దీనివల్ల రోగులకు సకాలంలో, సురక్షితంగా వైద్యం అందుతుందన్నారు.

అలాగే డయాలసిస్ కేంద్రంలో అదనపు బెడ్లు, ఏసీల ఏర్పాటుతో పాటు రోగుల కోసం ప్రత్యేకంగా మరో అంబులెన్స్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. గత 2018 సంవత్సరంలో రూ.22 కోట్ల వ్యయంతో మంజూరైన 100 పడకల నూతన ఆసుపత్రి భవన పనులు పూర్తయ్యాయని, త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నట్లు జూపల్లి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగుల సౌకర్యార్థం ఆసుపత్రి వద్ద రూ.5 లక్షల వ్యయంతో నూతన బస్ షెల్టర్ నిర్మిస్తున్నామని, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని నిరంతరం పర్యవేక్షిస్తూ రోగులకు అండగా ఉండాలని మంత్రి సూచించారు.

Leave a Reply