లారీలు రావడం లేదంటూ రైతుల రాస్తారోకో..

లింగంపేట్, ఆంధ్రప్రభ ; మండలంలోని భవానిపేట్ గ్రామ రైతులు శనివారం కొట్టాల్–కామారెడ్డి–నిజాంసాగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం తరలింపుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్లేకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన రైతులు, లారీ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సుమారు 300 మంది రైతుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పేరుకుపోయిందని తెలిపారు. రైస్ మిల్లర్లు లారీలను సకాలంలో ఖాళీ చేయించకపోవడంతో కొత్త లారీలు రావడం లేదని వాపోయారు.

తీవ్ర ఎండల్లో ధాన్యం వద్ద రైతులు నిరీక్షించాల్సి వస్తోందని, దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామ సర్పంచ్ సురేందర్ పేర్కొన్నారు. వర్షాలు వస్తే ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం పాడై రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయాలని కోరారు.

రాస్తారోకో సమాచారం తెలుసుకున్న ఎస్సై దీపక్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

ఇదిలా ఉండగా, భవానిపేట్ రైతుల సమస్యపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోకుల్ సాయిరాం స్పందించారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. గత వారం ఎమ్మెల్యే అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు గుర్తుచేశారు.

భవానిపేట్ రైతుల సమస్య పరిష్కారానికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీ యజమానులతో మాట్లాడేలా ఎమ్మెల్యేను కోరుతానని గోకుల్ సాయిరాం తెలిపారు. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.