కలెక్టరేట్ ముట్టడించిన సీపీఎం, సీపీఐ
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: జిల్లాలోని నిరుపేదలకు ప్రభుత్వ, భూదాన భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించాలని, అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కొల్లాపూర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించిన వామపక్ష నేతలు.. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉధృతం చేస్తామని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ధర్నాకు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.డి. ఫయాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల నరసింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ, భూదాన భూములను కబ్జాల నుంచి విముక్తం చేసి పేదలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకుండా, పేదలు నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేయడం బాధాకరమని విమర్శించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములను ఇప్పటికీ పేదలకు పంపిణీ చేయకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఇంకా వందలాది నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి స్థలం లేదని, వారికి వెంటనే ఇంటి జాగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కేశవ్ గౌడ్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. శ్రీను, దేశా నాయక్, కందికొండ గీత, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ. నరసింహ, ఈ. చంద్రమౌళి, ఆర్. ఇందిరా, శంకర్ గౌడ్‌తో పాటు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
